వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
కొత్త కోణం
ఆర్థిక అసమానతలు పెరగకుండా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పలు సూచనలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు వీటికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా వేస్తున్న అడుగులు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైనవి. బ్యాంకుల జాతీయీకరణ వల్ల సమాజంలోని పేద వర్గాలు లబ్ధి పొందాయి. కానీ వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే ప్రైవేటులోకి బ్యాంకులు వెళ్తే ఈ పేద వర్గాలు వాటి సేవలకు దూరమైపోతాయి. పైగా ప్రైవేటీకరణకు కారణం అని చెబుతున్న జాతీయ బ్యాంకుల నష్టాలు… వాటి అసమర్థత వల్ల కాకుండా, కార్పొరేట్ల రుణాల ఎగవేత వల్ల వచ్చినవే. కాబట్టి వాటి ప్రైవేటీకరణకు చెబుతున్న వాదనే అర్థం లేనిదని దీనితో తేలిపోతోంది.
దేశ ఆర్థికాభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనీ, దానివల్ల ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులోకి వస్తాయనీ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన రచన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’లో పేర్కొన్నారు. రాజ్యాంగ సభకు తాను వ్యక్తిగతంగా, అదేవిధంగా ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ ద్వారా సమర్పించిన నివేదిక ఇది. ఒక రకంగా ఇది అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ నమూనా. ఇందులోని చాలా అంశాలు రాజ్యాంగంలోకి రాలేదు. ఆర్థిక రంగంలో సమానత్వం కాకపోయినా కనీసం ప్రజాస్వామ్య విధానాలు అమలు జరగాలని అంబేడ్కర్ ఆశిం చారు. పరిశ్రమలు మాత్రమే కాదు, భూమిని కూడా జాతీయం చేయా లనీ, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, వారికే లీజుకి ఇవ్వాలనీ ప్రతిపా దించారు. కానీ, అంబేడ్కర్ ఆలోచనలు ఆరోజు చెల్లుబాటు కాలేదు.
అందువల్లనే, ఇవే విషయాలను పరోక్షంగా రాజ్యాంగంలోని నాలుగవ భాగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 38లో పొందు పరిచారు. ఇందులో రెండు అంశాలున్నాయి. మొదటిది, దేశంలోని అన్ని రంగాల్లో– సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం అందించాలనీ, దానికిగానూ ప్రజల సంక్షేమం కోసం ప్రభు త్వాలు తీవ్రంగా ప్రయత్నించాలనీ తెలియజేస్తున్నది. రెండవది, దేశం లోని వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా ప్రాంతాల, సమూహాల మధ్య అసమానతలు సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రభు త్వాలు కృషి చేయాలనీ, అవకాశాలు, సౌకర్యాల విషయంలో అసమా నతలు లేకుండా చూడాలనీ పేర్కొంటున్నది.
అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ చర్యలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం మాత్రమే కాకుండా, సహజ న్యాయానికి కూడా విరుద్ధమైనవి. పబ్లిక్ రంగంలో ఉన్న పరిశ్రమ లను, విమానయాన సంస్థలను, రైల్వేలను, ఇంకా అనేకానేక ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చాలా తొందర పడుతున్నది. అందులో భాగంగానే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్‌కు కట్టబెట్టే చర్యలను ముమ్మరం చేస్తోంది. అయితే భారత రాజకీయ చరిత్ర తెలిసిన వారెవ్వరికీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరి ఆశ్చర్యం కలిగించదు.
భారత దేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ 1770లో ప్రారం భమైంది. దానిపేరు బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్. 1829–32 మధ్య కాలంలో దీన్ని మూసివేశారు. జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1786లో ప్రారంభమయ్యింది. కానీ 1791లోనే ఆగిపోయింది. దానినే 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. ఆ తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌ను నెల కొల్పారు. ఈ మూడింటినీ 1921లో విలీనం చేసి, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఈ క్రమంలోనే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు ఒక మూల స్తంభం ఉండాలని అంబేడ్కర్ 1930 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. అందుకుగానూ రిజర్వు బ్యాంక్ ఉండాలని ప్రతిపాదించారు. అట్లా 1934లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా 1935లో రిజర్వు బ్యాంకుని ఏర్పాటు చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు.
స్వదేశీ ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని 1906 నుంచి 1911 వరకు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. అందులో కాథలిక్ సిరియన్ బ్యాంక్, ది సౌత్ ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇండియా ఇందులో ముఖ్యమైనవి. అయితే స్వాతంత్య్రానంతరం మరికొన్ని బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఏర్పా టయ్యాయి. 1969 వచ్చేటప్పటికి ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప చాలా బ్యాంకులు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. అవి వ్యాపారం ప్రధాన లక్ష్యంగా పనిచేయడం వల్ల పేదలకు అందుబాటులోకి రాలేదు. 1969కి ముందు బ్యాంకు బ్రాంచీల సంఖ్య 8 వేలు ఉంటే, ప్రస్తుతం 2021 లెక్కల ప్రకారం లక్షా 18 వేల బ్రాంచీలు ఉన్నాయి.
1969 జూలైలో పార్లమెంటులో బ్యాంకుల జాతీయీకరణపై జరిగిన చర్చలో అప్పుడు జనసంఘ్ పేరుతో ఉన్న ఇప్పటి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా బ్యాంకుల జాతీయీకరణ బిల్లును వ్యతి రేకించింది. అప్పటి జనసంఘ్ పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి, బల్రాజ్ మదోక్ తమ వ్యతిరేకతను తెలియజేశారు. ‘ఇది ప్రజా వ్యతిరేక, డిపాజిటర్ల వ్యతిరక, దేశ వ్యతిరేక బిల్లు’ అని అభి వర్ణించారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సంకల్పంతో, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెజారిటీతో ఆ బిల్లు ఆమోదం పొందింది.
బ్యాంకుల జాతీయీకరణ వల్ల ఎంతోమంది పేదలు, రైతులు, చేతివృత్తుల వాళ్ళు లబ్ధి పొందారు. పేద, మధ్య తరగతి వర్గ ప్రజల పిల్లల చదువులకు, చిన్న వ్యాపారులకు రుణాలు లభ్యమయ్యాయి. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ వాటాను పొందగలిగారు. అయితే అప్పటి జనసంఘ్ పెరిగి పెద్దదై భారతీయ జనతా పార్టీగా మారింది. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని పట్టుద లతో ఉన్నది. ప్రభుత్వ బ్యాంకులు సమర్థవంతంగా పనిచేయటం లేదనీ, అందువల్ల ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చామనీ నమ్మబలుకుతోంది. నిజానికి ఈ వాదన పూర్తిగా వాస్తవ విరుద్ధమైనదని రఘురామ రాజన్ లాంటి ఆర్థిక వేత్తలు, ఉద్యోగ, అధికారుల సంఘాల వారు ఎన్నో వివరాలతో దాన్ని కొట్టివేస్తున్నారు. నిజానికి ప్రైవేట్ బ్యాంకులే దివాళా తీస్తున్నాయన్న విషయాన్ని వాళ్ళు లెక్కలతో సహా చూపిస్తున్నారు. 1968కి ముందు వరకు దాదాపు 2,132 బ్యాంకులు దివాళా తీశాయి. ఇప్పటి వరకు 25 ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీసినట్టు సాక్ష్యాలున్నాయి. దానివల్ల కొన్ని వేల మంది డిపాజిట్‌దారులు, ఖాతాదారులు నష్టపోయారు. ఇంకొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ 25 బ్యాంకులను జాతీయ బ్యాంకుల్లో విలీనం చేసి, ప్రజలను ఆదుకోవడం జరిగింది.
జాతీయ బ్యాంకులు కూడా కొన్నిసార్లు నష్టాలకు గురైన మాట వాస్తవం. దానికి కారణం, మన సర్కారు ముద్దుబిడ్డలైన కార్పొరేట్ సంస్థలే కారణం. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం– 68 వేల కోట్ల రూపాయలను కేవలం 50 కార్పొరేట్ సంస్థలు ఎగవేసినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా దేశంలోని అతి పెద్ద కంపెనీలు 13 బ్యాంకులకు 4 లక్షల 46 వేల కోట్ల రూపాయలు అప్పుగా చెల్లిం చాల్సి ఉండగా, వారికి 2 లక్షల 80 వేల కోట్లు మాఫీ చేశారు. కేవలం 1 లక్షా 61 వేల కోట్లు మాత్రమే బ్యాంకుల్లో జమచేశారు. అంటే రెండు లక్షల 84 వేల కోట్లు బ్యాంకులకు నష్టం వాటిల్లినట్టే కదా? ఇది రాజకీయ తప్పిదమేనా లేక బ్యాంకుల నేరమా అన్న విషయం సుస్పష్టంగానే ఉంది. ముమ్మాటికీ బ్యాంకుల నేర మేమీ ఇందులో లేదు. రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారు.
భవిష్యత్తులో జాతీయ బ్యాంకులు ప్రైవేట్ పరం అయితే ప్రజల డబ్బుతో కార్పొరేట్ కంపెనీలు ఇంకా విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టి, ఒక వేళ ఆ కంపెనీలు నష్టపోతే అడిగే దిక్కుకూడా ఉండదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం అన్ని రంగాల్లో చేస్తున్నట్టే బ్యాంకులను కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్ప జెప్పి సంపదను ఇంకా, ఇంకా కొద్ది మంది ఖజానాలు నింపడానికి ప్రయత్నిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న పోరాటం, కేవలం వారికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు తమదిగా భావించి, రాజకీయంగా ప్రతిఘటించకపోతే దేశం మరింత అధ్వాన్న స్థితిలోకి వెళ్ళక తప్పదు.